Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-05-27 17:50:02
తెలుగు వెబ్ మీడియా న్యూస్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియమాకాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరు మొత్తం 5,77,417 వరకు దరఖాస్తులు సమర్పించారు. ఇక నిరుద్యోగులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొలువులు సొంతం చేసుకోవడానికి పోటాపోటీగా ప్రిపరేషన్ సాగిస్తున్నారు. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎస్టీటీ, ఎస్‌ఏ, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర సర్కార్ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా వెల్లడించలేదు. గతంలో తెల్పిన వివరాల మేరకు మే 30వ తేదీన హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ జారీ చేయకపోవడంపై అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది.
మరోవైపు జూన్ 6 నుంచి జులై 6వ తేదీ వరకు ఆన్‌లైన్ రాత పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ చెప్పింది. డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాల్లో కలిపి 20వేల వరకు సీటింగ్ సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తుంది. రోజుకు రెండు సెషన్‌లుగా పరీక్షలు నిర్వహించనుండగా.. ఈ లెక్కన రోజుకు 40 వేల మంది వరకు పరీక్ష రాసే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పిన కూటమి సర్కార్.. గత టెట్ నిర్వహించి 6 నెలలు ముగిశాయని, మరోమారు టెట్ పరీక్ష నిర్వహించాలని నిరుద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
పైగా ఈ నెల దరఖాస్తు గడువు మే 15 రాత్రి 11.59 గంటలకు డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అయితే దరఖాస్తు గడువు పొడిగించాలని నిరుద్యోగులు ఎంతగా మొత్తుకున్నా సర్కార్ మాత్రం మొండిగా అభ్యర్ధుల విన్నపాలను పెడచెవిన పెట్టింది. తొలుత చెప్పిన గడువుకే దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో పలువురికి తీరని ఆవేదనను మిగిలింది. దరఖాస్తు గడువు పొడిగిస్తే దాదాపు 7 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండేది. మరోవైపు ప్రిపరేషన్‌కు మరికాస్త గడువు పొడిగించాలని నిరుద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.